Tuesday, July 20, 2010

అగ్రదేశాధినేతని సైతం భయపెడుతోన్న భారతీయుల మేధస్సు..Maganti MuraliMohan

ఈ మధ్యన మా మిత్రుడు ఒక మంచి మాటన్నాడు.. డబ్బు బలం కావాలంటే అమెరికా కి వెళ్లు, మంది బలం కావాలంటే చైనా వెళ్లు, బుద్ధి బలం కావాంటే మాత్రం ఇండియా కి వెళ్లు అని అన్నాడు. అందులో ఎంతో నిజం ఉంది. ఎందుకంటే ఈ రోజున అమెరికా వాళ్ళకున్నంత డబ్బు బలం మరే దేశానికి లేదన్నది అక్షర సత్యం. కొత్తగా పనిచేసే వాళ్ళకు కూడా గంటకు ఐదు డాలర్లు ఇస్తున్నారక్కడ. అదే బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళకైతే గంటకు ఐదు వందల డాలర్లు కూడా ఇస్తున్నారు. మంది బలం(మ్యాన్ పవర్) కావాలంటే చైనా ఎందుకు వెళ్ళమన్నాడంటే, అక్కడ ప్రతి ఒక్కరూ ఎంతగానో కష్టపడతారు. ఎవరూ ఖాళీగా కూర్చోవడం కనిపించదు. చైనాలోని ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 15 గంటలు కష్టపడతారు. ఈరోజున చైనా వాళ్లు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. గుండు సూది దగ్గరనుండి విమానాల వరకు ప్రతి ఒక్కటీ వాళ్ళు ఉత్పత్తిచేస్తున్నవే ఎక్కువ. ఈ చైనా వస్తువులు లేకుంటే మన జీవితాలు ఏమైపోతాయో అన్నంతగా వాళ్ళు వృద్ధి చెందారు. ఇక బుద్ధి బలం కోసం భారతదేశం ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఇక్కడ చాలా మందికి డబ్బుంటే చదువుండదు…బాగా చదువుకున్నావాడికి డబ్బు ఉండదు.


మనదేశంలో ప్రతిభ ఉన్నవారికి కొదవ లేదు. అట్టడుగుస్థాయి నుండి వచ్చి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, నాలుగైదు కంప్యూటర్లు ఇద్దరు ఉద్యోగులతో మొదలయ్యి…ప్రపంచవ్యాప్తంగా ఐ.టి విభాగంలో ప్రపంచ ఖ్యాతినార్జించి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీగా “ఇన్ఫోసిస్” ని నిలబెట్టిన ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి గారు, విప్రో అజీమ్ ప్రేమ్‌జీ గారు ఇలా… ఎంతో మంది తమ బుద్ధి బలం తో భారతదేశానికి పేరు ప్రఖ్యాతులను సంపాదించిపెట్టారు. ఈ రోజున అమెరికా ప్రెసిడెంట్ కూడా అక్కడి విద్యార్ధులకు మన దేశపు విద్యార్ధులను ఉదాహరణగా చూపించి భారతీయుల్లా మీరూ బాగా కష్టపడి చదవండి…లేదంటే మీ ఉద్యోగాలు కూడా వాళ్లే ఎగరేసుకుపోతారు అని సాక్షాత్తూ అగ్రదేశాధినేత భయపడేంతలా మన దేశస్థుల మేధస్సు పదునెక్కుతోంది.

మరి అంత మేధోసంపత్తి కలిగి కేవలం డబ్బులేని కారణంగా మెరికల్లాంటి విద్యార్ధులు మరుగున పడకూడదనే ఉద్దేశంతోనే నాలుగేళ్ళ క్రితం నేను “మురళీమోహన్ ఛారిటబుల్ ట్రస్టు” ని స్థాపించి సుమారుగా వెయ్యి మంది విద్యార్ధులను చదివిస్తున్నాను. ఈ నాలుగేళ్ళ నుండి అంతా దివ్యంగా సాగింది. కానీ గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిని ఆర్ధికంగా చాలామంది చాలా రకాలుగా నష్టపోయారు. అందులో నేనూ ఒకడిని. ఈ రోజున ఆర్ధికంగా నష్టపోయానని చెప్పి నేను నడుపుతున్న ట్రస్ట్ ని మూయలేను. 900 మంది పైచిలుకు విద్యార్ధుల భవిష్యత్తు నామీద ఆధారపడి ఉంది. నా కష్టాలేమిటో..బాధలేమిటో వాళ్ళకి అనవసరం. అవసరమైతే కొన్ని ఆస్తులను అమ్మి అయినా వాళ్ళ చదువుకు ఎక్కడా ఆటంకం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా భుజాల మీద ఉంది. మహా అయితే ఈ పరిస్థితుల్లో నేను ఈ సంవత్సరం మా ట్రస్టులో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్యను కాస్త పరిమితం చేయగలను.


ఈ రోజున నేను చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నాకు ఇష్టం లేకపోయినా పది మందికీ తెలిసిపోయింది. నన్ను చూసి చాలామంది ప్రేరణ పొంది నాలాగే విద్యార్ధులను దత్తతకు తీసుకుని చదివిస్తున్నారు అని తెలిసినప్పుడు నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇటీవలే నాగార్జున గారు స్వయంగా నాకు ఫోను చేసి, మురళీమొహన్ గారు…మీరు చేస్తున్న ఈ విద్యాదానం చూసి నేను కూడా ఇన్‌స్పైర్ అయ్యాను. మీరు ఎలా చేస్తారు ఏమిటోఆ వివరాలు తెలిపితే నేను కూడా కొంతమంది పేద విద్యార్ధులను చదివిస్తాను”అన్నారు. నిజానికి ఎవరికి వారు కొద్దో గొప్పో ఆర్ధిక స్తోమత ఉన్న వాళ్ళు ఇలా కనీసం ఒక్కరినైనా పేద విద్యార్ధిని చదివిస్తే సమాజానికి ఎంతో ఉపకారం చేసిన వాళ్లమవుతాం.

No comments:

Post a Comment